Nara Lokesh: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఠాగూర్ కవితను ఉదాహరించిన లోకేశ్
- నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
- పోలీసులకు ఘననివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
- త్యాగధనులు అంటూ కొనియాడిన లోకేశ్
పోలీసులు లేని సమాజాన్ని ఏమాత్రం ఊహించలేం. వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులదీ కీలకపాత్రే. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు వెల్లువెతుతున్నాయి. ప్రముఖులు పోలీసుల సేవలను స్మరించుకుంటూ పోస్టులు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదాహరించారు.
"ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగగలడో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో... అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోని నా దేశాన్ని మేలుకొలుపు అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రార్థించారు. అటువంటి స్వేచ్చా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులే. అంతటి నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరికీ నివాళులు" అంటూ వ్యాఖ్యానించారు.