Madhya Pradesh: కమల్‌నాథ్‌కు ఈసీ నోటీసులు.. అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న ఎన్నికల కమిషన్

EC Issues notice to former CM Kamal Nath over his remarks on woman minister

  • ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఇమర్తి దేవిపై అనుచిత వ్యాఖ్యలు
  • 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలన్న ఎన్నికల కమిషన్
  • తాను ఎవరినీ అవమానించలేదన్న మాజీ సీఎం

మధ్యప్రదేశ్ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల దబ్రా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ.. మంత్రి ఇమర్తి దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి చాలా సింపుల్‌గా ఉంటారని, బీజేపీ అభ్యర్థి ఓ ఐటెమ్ అని పేర్కొన్న కమల్‌నాథ్.. ఆమె పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా మంత్రిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. దీంతో తాజాగా, ఎన్నికల కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన ఉద్దేశం ఏమిటో 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

కాగా, కమల్‌నాథ్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఇప్పటికే ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. ఎవరు చేసినా ఇలాంటి వ్యాఖ్యలు తప్పేనని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై కమల్‌నాథ్ స్పందిస్తూ.. ఎవరినీ అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని, తాను ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఇప్పటికే వివరణ ఇచ్చానని, కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ తాను ఎవరినైనా అవమానించినట్టు భావిస్తే ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News