Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే
- ఎన్సీపీలో చేరబోతున్న ఏక్నాథ్
- ఆయన నిర్ణయం ఒక చేదు నిజమన్న రాష్ట్ర బీజేపీ చీఫ్
- మరింత మంది వస్తున్నారన్న ఎన్సీపీ
మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే పార్టీకి రాంరాం చెప్పేశారు. రేపు ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తీర్థం పుచ్చుకోబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఖడ్సే నంబర్ 2గా గుర్తింపు పొందారు. అయితే, 2016 భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లభించకపోవడంతో కినుక వహించారు.
తాజాగా, పార్టీకి రాజీనామా చేసిన ఆయన శరద్ పవార్ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఖడ్సేలానే మరింత మంది బీజేపీ నేతలు ఎన్సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎన్సీపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ పేర్కొన్నారు. ఖడ్సే చేరికతో ఖాందేశ్ ప్రాంతంలో ఎన్సీపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏక్నాథ్ నిర్ణయాన్ని తాము ఊహించలేదని, ఆయన పార్టీని వీడడం ఓ చేదు నిజమని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు.