Indian Railways: రైల్వే నుంచి సరికొత్త సేవలు.. ఇక సామన్లు మోసుకెళ్లే బాధ తప్పినట్టే!
- బ్యాగ్స్ ఆన్ వీల్స్ మొబైల్ అప్లికేషన్ను తీసుకురానున్న రైల్వే
- సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు ఎంతగానో ఉపయోగం
- ప్రస్తుతం కొన్ని రైల్వే స్టేషన్లకే పరిమితం
రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను అందించనున్నట్టు తెలిపిన రైల్వే ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ స్టేషన్లలో తొలుత ఈ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘బ్యాగ్స్ ఆన్ వీల్స్’ (బీవోడబ్ల్యూ) అనే మొబైల్ అప్లికేషన్ను తీసుకురాబోతోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులిద్దరికీ ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కానుంది.
ఈ యాప్ను ఉపయోగించి ప్రయాణికులు తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు తరలించే సేవలు పొందవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు. అతి తక్కువ రుసుముతోనే డోర్-టు-డోర్ సేవలు అందిస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తొలుత ఈ సేవలను న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగ్రామ్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సేవల వల్ల రైల్వే ఆదాయం మరింత పెరుగుతుందని ఢిల్లీ డీఆర్ఎం ఎస్సీ జైన్ పేర్కొన్నారు.