Jyotiraditya Scindia: కాంగ్రెస్ ను వదిలేసినందుకు ఎలాంటి బాధ లేదు: జ్యోతిరాదిత్య సింధియా
- బీజేపీలో సంతోషంగా ఉన్నా
- సామర్థ్యాన్ని బట్టి బీజేపీలో పదవులు ఉంటాయి
- ప్రజా సేవ చేయడమే నా లక్ష్యం
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. బీజేపీలో చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి బీజేపీలో పదవులు లభిస్తాయని చెప్పారు. మోదీ, అమిత్ షా, నడ్డా వంటి నాయకులతో కలిసి ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడలేదని సింధియా చెప్పారు. ఎనిమిదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు తన కారుపై ఎర్రబుగ్గ పెట్టుకోలేదని అన్నారు. గత 20 ఏళ్లుగా తనను చాలా మంది చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలోనే తనకు తృప్తి ఉందన్నారు. సేవ చేసేందుకు లభించిన అవకాశంగానే రాజకీయాలను చూస్తానని చెప్పారు. తన తండ్రి మాదిరే తనకు కూడా ప్రజాసేవపైనే ఆసక్తి అని తెలిపారు.