Pawan Kalyan: తెలంగాణ సమస్యలపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్.... జీవో 111 అమలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- జీవో 111 అమలుకు తూట్లు పొడుస్తున్నారని వ్యాఖ్యలు
- చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ప్రశ్నించిన జనసేనాని
- తప్పులను టీఆర్ఎస్ సర్కారు సరిదిద్దాలన్న సూచన
జల వనరులను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎఫ్ టీఎల్ ను పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం... ఆపై క్రమబద్ధీకరణ చేయడం ఓ ధోరణిగా మారిందని విమర్శించారు.
అర్బన్ ప్లానింగ్ లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చక్కదిద్దాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలపై విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినంత బలంగా, అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాదులో 800 వరకు చెరువులు ఉన్నాయనుకుంటే, ఇప్పుడవి 180 మాత్రమే ఉన్నాయని పవన్ వెల్లడించారు.
"జీవో 111 తీసుకువచ్చిందే జలవనరులను పరిరక్షించేందుకు. పరీవాహక ప్రాంతాల నుంచి జల ప్రవాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే ఆ జీవో తెచ్చారు. ఈ జీవోకు 2009 నుంచి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పు చేసి, ఆపై డబ్బు కట్టేసి క్రమబద్ధీకరించుకోండి అనే ధోరణి ఇప్పటి దుస్థితికి దారితీసింది. ఆ తప్పులను సరిదిద్దే అవకాశం ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. భవిష్యత్ లో విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే జీవో 111కి తూట్లు పొడవకుండా బలంగా అమలు చేయాలి" అని సూచించారు.