KCR: ఇకపై దసరా మరుసటి రోజు కూడా సెలవు: సీఎం కేసీఆర్
- ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
- అక్టోబరు 26న సెలవు ప్రకటన
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
- ఒక డీఏ విడుదలకు ఆదేశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ వార్షిక బడ్జెట్ మధ్యంతర సమీక్ష, ఉద్యోగుల సమస్యలు, నిర్ణీత పంటల సాగు విధానం తదితర అంశాలపై ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఏడాది దసరా రోజునే కాకుండా, దసరా తర్వాత రోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తదనుగుణంగా షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దసరా తర్వాత రోజైన అక్టోబరు 26 కూడా సెలవుదినంగా నిర్ణయించారు.
అటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపి కబురు చెప్పారు. 2019 జూలై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు 5.25 శాతం డీఏ పెంచినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు డీఏ 33.53 శాతం ఉండగా, ఇకపై అది 38.77 శాతం కానుంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల్లో రెండింటి విషయంలో కేంద్రం నుంచి నిర్ణయం రావాల్సి ఉందని వివరించారు. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించే విధంగా ప్రతిపాదనలు తయారుచేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.