Samsung: శాంసంగ్‌ను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన చైర్మన్ లీ కున్ కన్నుమూత
- 2014 నుంచి హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న లీ
- 1987లో తండ్రి మరణం తర్వాత బాధ్యతల స్వీకరణ
- ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా శాంసంగ్‌ను తీర్చిదిద్దిన వైనం
గత ఆరు సంవత్సరాలుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్ హీ (78) కన్నుమూశారు. ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కంపెనీ తెలిపింది. లీ సారథ్యంలోని శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్‌ఫోన్లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని ఐదో వంతుతో సమానం కావడం గమనార్హం.
లీ 2014లో తొలిసారి గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. చైర్మన్ కున్ హీ మృతి బాధాకరమని కంపెనీ తెలిపింది. కొరియాలోని డేగులో 9 జనవరి 1942లో లీ జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం తర్వాత 1987లో లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో అగ్రగామి సంస్థగా శాంసంగ్‌ను తీర్చిదిద్దారు.