Kishan Reddy: డబుల్ బెడ్రూం ఇళ్లతో టీఆర్ఎస్ కంటే మాకే ఎక్కువ లాభం: కిషన్ రెడ్డి
- డబుల్ బెడ్రూమ్ రాని వాళ్లంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకమౌతారు
- దుబ్బాకలో బీజేపీ తరపున నిరుద్యోగులు కూడా ప్రచారం చేస్తున్నారు
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలవడంపై ఇంకా చర్చించలేదు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వల్ల టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ లాభమని అన్నారు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ... ఒక బస్తీలో ఐదు, ఆరు వందల మంది ఇళ్లు ఆశించేవారు ఉంటారని... ప్రభుత్వం వంద మందికి కూడా ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు. దీంతో, ఇల్లు వచ్చిన వారు సంతోషంగా ఉంటారని... రానివారు కడుపుమంటతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని అన్నారు.
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ తరపున నిరుద్యోగులు కూడా ప్రచారం చేస్తున్నారని... దీన్ని మంత్రి హరీశ్ రావు తట్టుకోలేకపోతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేపదే హరీశ్ చిరాకు పడుతున్నారని... బీజేపీ గెలవబోతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలని వ్యాపారవేత్తలకు స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని కిషన్ రెడ్డి చెప్పారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ఇంకా నివేదిక ఇవ్వలేదని... నివేదిక ఇచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలవడంపై ఇంకా పార్టీలో చర్చించలేదని అన్నారు.