TRS: దుబ్బాకలో బీజేపీ ఆడుతున్న డ్రామా బట్టబయలైంది: టీఆర్ఎస్
- త్వరలో దుబ్బాక ఉప ఎన్నికలు
- నిన్న సిద్ధిపేటలో పోలీసుల సోదాలు
- బీజేపీ అభ్యర్థి బంధువుల నుంచి రూ.18 లక్షలు స్వాధీనం
- పోలీసులే ఆ డబ్బు తెచ్చిపెట్టారంటున్న బీజేపీ కార్యకర్తలు
తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు దుబ్బాక చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, నిన్న హైడ్రామా నెలకొంది. సిద్ధిపేటలో పోలీసులు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేసి, ఆయన మామ నివాసం నుంచి రూ.18 లక్షలు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.
దీనిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులే ఆ డబ్బును తెచ్చిపెట్టి, సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ వర్గాల ఆరోపణ. దీనిపై టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. పోలీసులు రఘునందన్ రావు మామ ఇంట్లో సోదాలు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్న వీడియోను పంచుకుంది.
దుబ్బాకలో నిన్నటి నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆడుతున్న డ్రామా బట్టబయలైందని తెలిపింది. 'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' (దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా) అని ఈ వీడియోతో నిరూపితమైందని వెల్లడించింది.