Raghu Rama Krishna Raju: ఏపీలో క్రిస్టియన్ల జనాభా పెరగడంపై మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ
- క్రిస్టియన్ జనాభా 25 శాతానికి పెరిగింది
- 33 వేల చర్చిలను ఏర్పాటు చేశారు
- ప్రజాధనాన్ని మతమార్పిడికి వాడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడి యథేచ్చగా జరుగుతోందంటూ ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. 2011లో ఏపీలో క్రిస్టియన్ల జనాభా 1.8 శాతంగా ఉందని... ఇప్పుడు అది 25 శాతం వరకు పెరిగిందని, అయితే ఇది ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం లేదని చెప్పారు. ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పారు.
రాష్ట్రంలోని 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని రఘురాజు తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో దాదాపు 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు సమానంగా చర్చిలను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజాధనాన్ని మతమార్పిడికి వాడకుండా అడ్డుకోవాలని ప్రధానిని కోరారు. 2021 జనాభా లెక్కల్లో తప్పులను సరిదిద్దాలని, మత మార్పిడి చేసుకున్న వారిని గుర్తించి... అర్హులకు మాత్రమే రిజర్వేషన్లను కల్పించాలని కోరారు.