Rajinikanth: ఆ లేఖ నాది కాదు... కానీ నా ఆరోగ్యంపై అందులో ఉన్న సమాచారం నిజమే: రజనీకాంత్
- సోషల్ మీడియాలో రజనీకాంత్ పేరిట ఓ లేఖ వైరల్
- క్లారిటీ ఇచ్చిన తలైవా
- రాజకీయ భవితవ్యంపై త్వరలోనే అధికారిక ప్రకటన
రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రజనీకాంత్ స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' (ఆర్ఎంఎం) సభ్యులతో చర్చించిన తర్వాత ఓ అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.
కాగా, రజనీ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఈసారి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు. అంతేకాదు, ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని, ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.
కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రాణాలకే ముప్పు అని లేఖలో వివరించారు.