Visakhapatnam District: వాస్తుకు అడ్డంగా ఉందట.. ఇంటి బయట సిమెంటు రోడ్డును ధ్వంసం చేసిన నాయకుడు!
- విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలంలో ఘటన
- 2017-18లో రూ. 5 లక్షలతో నిర్మాణం
- తమ భూమిలో వేయడం వల్లే తొలగించామంటున్న నాయకుడు
తన ఇంటి వాస్తుకు బయట ఉన్న సిమెంటు రోడ్డు అడ్డుగా ఉందన్న కారణంతో దానిని ధ్వంసం చేశాడో నాయకుడు. విశాఖపట్టణం జిల్లాలోని ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో జరిగిందీ ఘటన. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా 2017-18లో రూ. 5 లక్షల నిధులతో 152 మీటర్ల మేర సిమెంటు రోడ్డును అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది.
అయితే, ఇప్పుడా రోడ్డు తన ఇంట్లోని వాస్తుకు అడ్డంగా ఉందని భావించి స్థానిక నాయకుడొకరు దానిని ధ్వంసం చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డును ధ్వంసం చేసిన నాయకుడు మాత్రం తమ జిరాయితీ భూమిలో వేయడం వల్లే తొలగించినట్టు చెబుతున్నారు. రోడ్డు ధ్వంసంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని స్థానిక సచివాలయ అధికారులు తెలిపారు.