bcg: బీసీజీ టీకాతో వృద్ధుల్లో కరోనాతో పోరాడే సామర్థ్యం: ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
- పెరిగిన మెమెరీ సెల్ ప్రతిస్పందనలు
- ప్రతిరక్షకాల ఉత్పత్తిని కూడా పెంచిన బీసీజీ టీకా
- 86 మంది వృద్ధులపై అధ్యయనం
- 54 మందికి టీకా ఇచ్చి పరిశోధన
కరోనాపై పరిశోధనలు చేస్తోన్న భారత శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. కరోనా వైరస్ వంటి వ్యాధులతో పోరాడటంలో వృద్ధుల్లో బీసీజీ వ్యాక్సిన్ సహకరిస్తున్నట్టు తాజాగా తేలింది. వారిలో మెమెరీ సెల్ ప్రతిస్పందనలతో పాటు ప్రతిరక్షకాల ఉత్పత్తిని పెంచడంలో బీసీజీ పనిచేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది.
ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 60 ఏళ్లు దాటిన ఆరోగ్యవంతులైన 86 మంది వృద్ధులపై చేసిన అధ్యయనంలో భాగంగా 54 మందికి టీకా ఇచ్చారు. అలాగే, మిగతా 32 మందికి ఇవ్వకుండా వారిలో మార్పులను అధ్యయనం చేశారు. టీకా తీసుకున్న వారిని నెల రోజుల అనంతరం పరిశీలించారు. వారిలో ఆరోగ్యవంతుల్లో రోగనిరోధకశక్తి పెరిగిందని చెప్పారు.
ఇది కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సహకరిస్తుందని తెలిపారు. కరోనాపై పోరాడే సామర్థ్యాన్ని ఇది పెంచుతుందని ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ సమిరన్ పండా చెప్పారు. కరోనా సోకితే దానిపై పోరాటంతో ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. బీసీజీ టీకా వేయించుకున్న వృద్ధులపై గతంలో చేసిన అనేక పరిశోధనలు శ్వాసకోశ వ్యాధుల నుంచి ఆ టీకా వారిని రక్షించినట్టు తేల్చాయి.