KTR: తొలిరోజే రూ.3,200 కోట్ల పెట్టుబడులు రావడం సంతోషం కలిగిస్తోంది: మంత్రి కేటీఆర్
- తెలంగాణలో కొత్తగా విద్యుత్ వాహన విధానం
- ఈవీ పాలసీ విడుదల చేసిన మంత్రి కేటీఆర్
- 15 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడి
తెలంగాణలో విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో జీరో రిజిస్ట్రేషన్ ఫీజుతో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈవీ పాలసీని ఇవాళ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్ విద్యుత్ వాహన, ఇంధన పొదుపు పాలసీ 2020-2030ని కేబినెట్ సహచరులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఎండీ పవన్ గోయెంకాలతో కలిసి ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
పాలసీ విడుదల చేసిన తొలిరోజే తెలంగాణకు రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు ఆకర్షించగలగడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మరో రంగం వేళ్లూనుకుంటోందని, తెలంగాణ యువతకు 15 వేలకు పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఈవీ పాలసీ ప్రతి ఒక్కరికీ విద్యుత్ వాహన వినియోగం అందుబాటులోకి వచ్చేందుకు ఉపకరిస్తుందని వివరించారు.
రాష్ట్రంలో విద్యుత్ ఆధారిత వాహన తయారీ, విడిభాగాల తయారీ, చార్జింగ్ వ్యవస్థల ఏర్పాటు తదితర రంగాలను తెలంగాణ ఈవీ పాలసీ ముందుకు తీసుకెళుతుందని అన్నారు. ఇప్పటికే నెలకొని ఉన్న ఈఎంసీ (ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు) సముదాయాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు, రాబోయే ఈఎస్ఎస్ క్లస్టర్లు, తాజా ఈవీ పాలసీ అన్నీ కలగలసి తెలంగాణను స్థిర, పునరుత్పాదక ఇంధన రంగంలో తిరుగులేని విధంగా అగ్రస్థానంలో నిలుపుతాయని కేటీఆర్ ఉద్ఘాటించారు.