Sea Plane: సీ ప్లేన్ లో విహరించిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!
- ఐక్యతా విగ్రహం వద్ద వాటర్ ఏరోడ్రోమ్ ప్రారంభం
- అందుబాటులోకి వచ్చిన సీ ప్లేన్ సేవలు
- టికెట్ వెల రూ.4,800
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ప్రారంభోత్సవాలతో బిజీగా ఉన్నారు. నిన్న ఆరోగ్య వన్, విహంగ సంరక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఇవాళ సీ ప్లేన్ సేవలను ప్రారంభించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే ఈ సీ ప్లేన్ లో ఆయన విహరించారు. దేశంలోనే తొలి వాటర్ ఏరోడ్రోమ్ ను ప్రారంభించిన ఆయన కెవాడియా నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు సీ ప్లేన్ లో ప్రయాణించారు.
నర్మదా జిల్లాలోని కెవాడియా వద్ద ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం ఇప్పుడో సుప్రసిద్ధ పర్యాటక స్థలంగా మారింది. అందుకే అక్కడికి వచ్చే పర్యాటకులకు వినూత్న అనుభవాన్ని అందించేందుకు సీ ప్లేన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విమానం నీటి పైనుంచి టేకాఫ్ తీసుకోవడమే కాదు, నీటిపైనే ల్యాండ్ అవుతుంది.
ఈ సీ ప్లేన్ ను స్పైస్ జెట్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా మాల్దీవుల నుంచి తీసుకువచ్చారు. ఇది గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఒక్కసారి ఇంధనం నింపితే సగటున 3 గంటలు ఎగరగలదు. ఇందులో ఒక్కసారి ప్రయాణించడానికి రూ.4,800 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు.