KCR: అందుకే మోదీ బొమ్మలు తగలబెట్టారు: కేసీఆర్
- కార్పొరేట్ కంపెనీల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
- ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి
- పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పాస్ చేసిందని అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూనే దసరా పండుగ నాడు రావణాసురుడికి బదులుగా మోదీ బొమ్మలను రైతులు తగలబెట్టారని అన్నారు. తెలంగాణ రైతులు కూడా పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు.
పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణాలో 38.64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే... కేంద్ర ప్రభుత్వం కేవలం 7 లక్షల మందికి మాత్రమే రూ. 200 చొప్పున ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తాను చెప్పేది తప్పైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చెప్పే అవాస్తవాలను ఓటర్లు నమ్మరని అన్నారు.