Boris Johnson: మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించిన బ్రిటన్!
- గురువారం నుంచి లాక్ డౌన్ మొదలు
- నాలుగు వారాలు కొనసాగుతుంది
- ప్రజలు సహకరించాలన్న ప్రధాని బోరిస్ జాన్సన్
కరోనా వ్యాప్తి రెండో దశలోకి ప్రవేశించిన వేళ, బ్రిటన్ లో మరోసారి లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. నవంబర్ 5, గురువారం నుంచి నాలుగు వారాల పాటు లాక్ డౌన్ ను అమలు చేయనున్నామని తెలిపారు. విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపును ఇస్తున్నామని వెల్లడించిన ఆయన, కరోనాను అడ్డుకునేందుకు మరో మార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
కాగా, తొలి దశతో పోలిస్తే, రెండవ దశలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని వైద్య రంగ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలోనే, లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించిన ఆయన, మరే ప్రత్యామ్నాయమూ లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటికి మాత్రమే పరిమితం కావాలని, నిత్యావసరాలు, వైద్యం, ఆహారం కోసం మాత్రమే బయటకు రావాలని ఆయన కోరారు. ఉద్యోగులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను మరికొంత కాలం కొనసాగిస్తామని తెలిపారు.