Air Car: రోడ్డుపై నడిచే కారు రెక్కలు విచ్చుకుని గాల్లోకి ఎగిరితే...!
- గాల్లో ఎగిరే కారు తయారుచేసిన స్లొవేకియా సంస్థ
- ప్రయోగాలు విజయవంతం
- సందడి చేస్తున్న వీడియో
ఇప్పుడు ప్రతిదీ టెక్నాలజీ మయం. కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచ గతిని సమూలంగా మార్చివేస్తున్న తరుణం ఇది. అరచేతిలో ప్రపంచం సాక్షాత్కారమవుతోంది. వాహనాలు సైతం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అంతేకాదు, రోడ్లపై పరుగులు తీసే కార్లు రివ్వున గాల్లోకి ఎగురుతున్నాయి. స్లొవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ అనే సంస్థ తాజాగా ఎగిరే కారును అభివృద్ధి చేసింది.
ఇది రోడ్డుపై పరుగులు తీయడమే కాదు, రెక్కలు విచ్చుకుని విమానంలా మారి గాల్లో విహరించగలదు. ఎయిర్ కార్ పేరిట తయారుచేసిన ఈ హైబ్రిడ్ వాహనం తాలూకు వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎయిర్ కార్ చూడ్డానికి మామూలు కారులా ఉన్నా, రన్ వే పైకి చేరిందంటే దీంట్లో ముడుచుకుని ఉన్న రెక్కలు విచ్చుకుంటాయి. విమానంలాగానే గాల్లోకి టేకాఫ్ తీసుకుంటుంది.
ఈ కారు బరువు 1,100 కిలోలు. ఇది 200 కిలోల బరువు మోయగలదు. దీంట్లో బీఎండబ్ల్యూ 1.6 లీటర్ శక్తిమంతమైన ఇంజిన్ అమర్చారు. ఒక్కసారి ఇంధనం నింపితే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రొఫెసర్ స్టీఫెన్ క్లెయిన్ రూపొందించిన ఈ ఎయిర్ కార్ ను గతేడాది చైనాలో జరిగిన అంతర్జాతీయ ఎక్స్ పోలో ప్రదర్శించారు. క్లెయిన్ విజన్ సంస్థ 30 ఏళ్లు శ్రమించి ఈ ఎగిరే కారును తయారుచేసింది. ఇప్పటివరకు రెండు పర్యాయాలు టెస్ట్ ఫ్లైట్ నిర్వహించగా, రెండుసార్లు విజయవంతమైంది.