Srinivas: బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించిన కార్యకర్త
- ఇటీవలే బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఆ రోజు తనకు జ్వరంగా ఉందన్న కార్యకర్త శ్రీనివాస్
- అందుకే ఇవాళ వచ్చి ఆత్మాహుతికి యత్నించినట్టు వెల్లడి
హైదరాబాదులో శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఇటీవల సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాస్... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దాంతో తీవ్రంగా మంటలు చెలరేగాయి. అక్కడివాళ్లు స్పందించి శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెం వాసి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40 శాతం పైగా కాలిన గాయాలు అయినట్టు భావిస్తున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ అయిన రోజున తనకు జ్వరంగా ఉందని, అందుకు ఇవాళ వచ్చి ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస్ తెలిపాడు. బండి సంజయ్ కోసం, అరవింద్ కోసం, రఘనందన్ కోసం ఏంచేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఏయ్ కేసీఆర్ నువ్వేం చేయలేవు అంటూ శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశాడు.