Telangana: దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్.. గెలుపుపై ఎవరికి వారే ధీమా!
- గత ఎన్నికలతో పోలిస్తే 3.63 శాతం తక్కువ పోలింగ్
- కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటేసేలా చర్యలు
- జ్వరం లక్షణాలు ఉన్న వారికి సాయంత్రం ఓటు వేసే అవకాశం
నిన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఒకటి రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడడంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజ్ చేశారు. అలాగే, ఈవీఎం బటన్ నొక్కేందుకు కుడి చేతికి గ్లౌజు అందించారు. శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసిన అధికారులు జ్వరం లక్షణాలు ఉన్న వారికి సాయంత్రం 5-6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు పంపిణీ చేశారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10వ తేదీన ఫలితం రానుండగా, గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ శాతం భారీగానే నమోదైనప్పటికీ గత ఎన్నికల (86.24 శాతం)తో పోలిస్తే 3.63 శాతం తక్కువ కావడం గమనార్హం. కాగా, దుబ్బాక నియోజకవర్గంలోని 10 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొంతసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. సరిచేసిన అనంతరం తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.