Ritchie Torres: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు సృష్టించిన నల్లజాతి స్వలింగ సంపర్కుడు
- 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంటుకు ఎన్నిక
- మరో నల్లజాతి గే ఎన్నికపై స్పష్టత కరవు
- గే ఎన్నికపై సర్వత్ర హర్షాతిరేకాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యూఎస్ కాంగ్రెస్ (పార్లమెంటు)కు ఎన్నికైన తొలి నల్లజాతి స్వలింగ సంపర్కుడిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్ (32) చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న ఆయన తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌పై విజయం సాధించి న్యూయార్క్‌లోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టోరెస్ మాట్లాడుతూ నేటి నుంచి అమెరికాలో కొత్త శకం మొదలవుతుందన్నారు. టోరెస్ 2013 నుంచి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
తాజా ఎన్నికల్లో మరో నల్లజాతి స్వలింగ సంపర్కుడైన మాండెయిర్ జోన్స్ (33)తో కలిసి బరిలోకి దిగారు. వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి జోన్స్ కాంగ్రెస్‌కు పోటీపడగా ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండడంతో ఆయన గెలుపోటములపై సమాచారం లేదు. జోన్స్ కూడా విజయం సాధిస్తే కనుక అమెరికా కాంగ్రెస్‌కు ఇద్దరు స్వలింగ సంపర్కులు ఎన్నికైనట్టు అవుతుంది. నల్లజాతి స్వలింగ సంపర్కులకు కాంగ్రెస్‌లో చోటు లభించడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.