Uttar Pradesh: సైకిల్ మీద వెళ్లి ఆదర్శంగా నిలిచిన యూపీ మంత్రి
- సైకిల్‌పై వెళ్లి అధికారులతో భేటీ
- స్థానికులతో ముచ్చట
- విద్యుత్ బకాయిలు చెల్లించాలని పిలుపు
- వెంటనే చెల్లించిన స్థానికులు
మంత్రులు సాధారణంగా కార్లలో, చుట్టూ భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కడికెళ్లాలన్నా కారు ఉండాల్సిందే. పర్యావరణ పరిరక్షణ కోసం ఇతరులను మాత్రం కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల వంటివి వాడొద్దని చెబుతుంటారు. అలాగే, ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కాలని అంటుంటారు. అయితే, ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ మాత్రం అందరిలాంటి మంత్రి కాదు. తాను చేసే పనుల ద్వారానే ప్రజలకు సందేశమిస్తున్నారు.
తాజాగా ఆయన తన కార్యాలయానికి సైకిల్ మీద వెళ్లారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. బంగ్లా బజార్, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్ సబ్‌సెంటర్లకు కూడా ఆయన సైకిల్ పైనే వెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపి పనితీరును తెలుసుకున్నారు. పలువురు వినియోగదారులను స్వయంగా కలసి, వారికి విద్యుత్ సరిగ్గా అందుతోందా? లేదా? అన్న విషయాలు తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలని చెప్పారు. దీంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడికక్కడే బిల్లులు చెల్లించారు.