padmakka: బెంగళూరు వెళుతుండగా మావోయిస్టు మాజీ సభ్యురాలు పద్మక్క అరెస్ట్.. కుటుంబ సభ్యులకు అప్పగింత
- గత కొన్నేళ్లుగా అజ్ఞాతంలో పద్మక్క
- అనారోగ్యం కారణంగా సోదరుడి ఇంట్లో
- బైండోవర్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగింత
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మాజీ మావోయిస్టు, పీపుల్స్‌వార్ మాజీ సభ్యురాలైన కనకరాజు పద్మావతి అలియాస్ పద్మక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల నుంచి ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు వెళ్తున్న ఆమెను నంద్యాల మండలంలోని రైతునగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నంద్యాల తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏరియా దళ సభ్యురాలైన ఆమె తలపై రూ. 5 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు సమాచారం. పద్మక్క భర్త, ఆమె సోదరుడు దివంగత దివాకర్ ఇద్దరూ మావోయిస్టులే. గత కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న పద్మక్క అనారోగ్యం కారణంగా ఇటీవల తన సోదరుడైన రిటైర్డ్ ఉద్యోగి బాలశేఖర్ ఇంట్లో ఉంటున్నారు.
బెంగళూరులో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆమె కుమార్తె ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులు, ఆర్టీసీ డీఎంను కలవడంతో ఆమె అరెస్ట్ విషయం వెలుగుచూసింది. కాగా, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన అనంతరం నిన్న రాత్రి పద్మక్కను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.