USA: ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అమెరికా కంటే భారత్ చాలా బెటర్.. ఎందుకంటే..!

America and India election procedure

  • భారత్‌లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ
  • అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రక్రియ
  • ఓటింగ్ రోజున భారత్‌లో కొన్ని గంటల్లో మెజార్టీ ఏ పార్టీకో తేలిపోతుంది
  • అమెరికాలో మూడు రోజులు అవుతున్నా తేలని వైనం
  • పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై గందరగోళం.. ఆందోళనలు

భారత్‌లో ఎన్నికల ప్రక్రియ ఎంత సరళంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎన్నికలన్నీ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. ఎన్నికల ఫలితాలు కూడా కౌంటింగ్‌ రోజున కొన్ని గంటల్లో తేలిపోతాయి. ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్న విషయం కూడా మధ్యాహ్నంలోగా తేలిపోతుంది.

అయితే, అమెరికాలో మాత్రం మూడు రోజులుగా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అంతేగాక, పోస్టల్ బ్యాలెట్ పై రిపబ్లికన్లు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలకు కూడా దిగారు. అమెరికా ఎన్నికల ప్రక్రియ తీరు అంతా గందరగోళంగా సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు అమెరికా ఎన్నికల ప్రక్రియలోనే ఎన్నో లొసుగులున్నాయని నిపుణులు అంటున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓటింగ్‌లో ప్రతి ఓటును అన్ని ఆధారాలతో సరిచూసిన అనంతరమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫలితాలు రావడం ఆలస్యమవుతోంది. అంతేగాక, పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రిపబ్లికన్ నేతలు కోర్టులకు వెళ్లారు.

అగ్రరాజ్యంలో ఎన్నికల నిర్వహణ తీరుని నిపుణులు తప్పుబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో భారత్‌ను చూసి అగ్రరాజ్యం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భారత్‌లో చాలా పారదర్శకంగా, ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తోన్న తీరును అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల తీరును పోల్చి చూద్దాం.

అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అయితే, ఇది ఎన్నికలు నిర్వహించదు. ఆ కమిషన్ ఎన్నికల ప్రచారాల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. రాజకీయ పార్టీల నిధుల సేకరణ, ఖర్చులు వంటి అంశాలను ఆ కమిషన్ నియంత్రిస్తుంది. అమెరికాలోని రాష్ట్రాల్లోని స్థానిక అధికారులే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే నిజానికి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తాయి.

దీంతో కొన్ని రాష్ట్రాల్లో తమ  పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేటట్లు ప్రభుత్వ నేతలు పలు చర్యలకు పాల్పడే అవకాశం ఇక్కడ ఉంటుంది. దీంతో ఓడిపోయిన నేతలు కోర్టులకు వెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌తో మాత్రం అలాకాదు. దేశంలో ఎన్నికల సంఘమే పూర్థిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ అధికారాలు పరిమితంగానే ఉంటాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకే దేశ వ్యాప్తంగా అధికారులు పనిచేస్తారు.

అలాగే, ఓటర్ల జాబితా, ఓటర్ల నమోదు ప్రక్రియ అంశంలోనూ అమెరికాలో గందరగోళం నెలకొంటోంది. అక్కడ జాతీయ ఓటర్ల జాబితా అంటూ ఏదీ లేదు. ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి స్థానిక అధికారులే తమ ప్రాంతంలో ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తారు. అయితే, ఈ ప్రక్రియలో కొందరు పౌరుల పట్ల గతంలో వివక్ష కొనసాగిందన్న విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతోన్న రోజున కూడా కొత్త ఓటర్ల నమోదుకు అనుమతి ఉండడం గమనార్హం. దీంతో సమస్యలు ఎదురవుతున్నాయి. భారత్‌లో మాత్రం అలా జరిగే అవకాశమే లేదు. ఓటర్ల లిస్టును ప్రభుత్వం కాకుండా ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వేసే అవకాశం కొందరికి మాత్రమే ఉంటుంది. పోలింగ్ సమయం దాటిపోతే ఓట్లు వేసేందుకు క్యూలో నిలబడేందుకు అనుమతి ఉండదు. భారత్ లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓట్లు వేస్తారు. వారు ఎవరికి ఓటు వేశారో కూడా వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా తెలుసుకోవచ్చు.

అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో ఒకే  బ్యాలెట్ విధానం కూడా లేకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో పేపర్ బాలెట్లకు బదులుగా ఈవీఎంలు కూడా ఉంటాయి. ఓటరుగా పేరు నమోదు చేసుకోని వారు కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంది. అటువంటి వారికి స్థానిక ఎన్నికల అధికారులు తాత్కాలిక ఓటరు నమోదు పత్రం ఇస్తారు.

అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే మరో సమస్య  బ్యాలెట్ పేపర్లను పోస్టల్ ఓటింగ్ కోసం ఓటర్లు కొన్ని రోజుల ముందు కూడా తీసుకోవచ్చు.  అయితే, అవి చిరిగిపోవడం, చోరీకి గురికావడం వంటి సమస్యలతో పాటు పలు సమస్యలు ఎదురవుతుంటాయి. పోస్టల్ బాలెట్లను తిరస్కరించే విషయంలో అమెరికాలో సరైన నిబంధనలూ అమల్లో లేవు. భారత్‌లో మాత్రం దేశం మొత్తం ఒకే విధానంలో ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల రోజు మాత్రమే ఓటర్లు ఓట్లు వేస్తారు. ఓటును ఎన్నికల సంఘం విధించిన గడువులోపే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అమెరికాలో 'ఎలక్షన్ డే'కు ముందుగానే ఓటింగ్ ప్రారంభం అవుతుంది. అనంతరం కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక మంది ఓటర్లు ఏ రోజైతే ఓట్లు వేస్తారో ఆ రోజునే ఎలక్షన్ డేగా పరిగణిస్తారు. అలాగే, ఎలక్షన్ డే రోజు అమెరికాలో 'ప్రభుత్వ సెలవు దినం' కూడా ఉండదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడేందుకు చాలా ఇబ్బందులు పడతారు.
భారత్‌లో ఈ పరిస్థితులు లేవు.. ఎన్నికల రోజున ప్రభుత్వ సెలవుదినం ఉంటుంది. దీంతో ఓట్లు వేసేందుకు అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ సారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 15 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ముగిసేసరికి కొన్ని రోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఓటర్లు ఎన్నుకున్న వారిని 'ఎలక్టోరల్ కాలేజీ' అంటారు. ఇలా ఎన్నికైన వారు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

భారత్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా పౌరులు ఓట్లు వేశారు. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రోజున కొన్ని గంటల్లోనే అధిక శాతం సీట్లలో గెలుపు ఎవరిదో స్పష్టమైపోయింది. అలాగే, రాత్రిలోగా పూర్తిగా ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో కంటే భారత్‌లో ఎన్నికల ప్రక్రియ చాలా సరళతరంగా ఉందని చెప్పుకోవచ్చు.

  • Loading...

More Telugu News