Boris Johnson: బ్రిటన్ ప్రధాని నోట రాముడు, సీత, రావణ సంహారం మాట!
- బోరిస్ జాన్సన్ దీపావళి సందేశం
- బ్రిటన్ లోని హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- చీకటిపై వెలుగుదే విజయం అంటూ వ్యాఖ్యలు
ప్రపంచంలో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ఇప్పటికీ అక్కడ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి తాము తప్పకుండా బయటపడగలమంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దీపావళి సందేశం వెలురిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ లో గణనీయమైన సంఖ్యలో ఉన్న భారత సంతతి ప్రజలకు ఆయన దీపావళి సందేశం అందించారు.
మున్ముందు భారీ సవాళ్లు ఎదురవుతాయనడంలో సందేహంలేదని, అయితే వాటిని తాము అధిగమించగలమన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరిపైనా తనకు విశ్వాసం ఉందని, అందరం కలిసికట్టుగా కృషి చేస్తే వైరస్ మహమ్మారిని జయించగలమని అన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తాయని దీపావళి చాటుతోందని పేర్కొన్నారు.
"శ్రీరాముడు, ఆయన భార్య సీతాదేవి రాక్షసరాజు రావణుడ్ని సంహరించాక తిరిగి వచ్చే క్రమంలో వారు ప్రయాణించిన మార్గం అంతా కోట్లాది దీపాలతో వెలిగిపోయింది. మనం కూడా దీన్నే స్ఫూర్తిగా తీసుకుందాం. కరోనా వైరస్ ను ఓడిద్దాం. ఆపై అంతా వెలుగులే" అని వివరించారు.
అయితే హిందువులు ఈసారి దీపావళిని కరోనా నిబంధనల మధ్య జరుపుకోవాల్సి రావడం విచారకరమని, బంధుమిత్రులందరూ ఒక్కచోట గుమికూడి సమోసాలు, గులాబ్ జామూన్ లు తింటూ దీపావళి పండుగ జరుపుకోవడం కష్టమేనని బోరిస్ జాన్సన్ అన్నారు.