Kollywood: నన్ను జైలులో పెట్టించినా పర్వాలేదు.. నటుడు విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
- నేనేం చేసినా అతడి మంచి కోసమే
- నన్ను జైలుకు పంపినా కూడా చరిత్రే
- పెద్ద స్టార్ అయినంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్‌పై ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏం చేసినా విజయ్ మంచి కోసమేనని పేర్కొన్నారు. రాజకీయ ప్రవేశానికి సిద్ధమైన చంద్రశేఖర్ ఇటీవల తన పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాదు, తన పేరును కానీ, ఫొటోలను కానీ వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించాడు.
చర్యలు తీసుకుంటానన్న కుమారుడి హెచ్చరికలపై చంద్రశేఖర్ స్పందించారు. విజయ్ పేరు, ఫొటో వ్యవహారంలో తనను జైలులో పెట్టించినా పర్వాలేదని అన్నారు. నిన్న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని ఎప్పటికీ ఉన్నత స్థానంలో చూడాలన్నదే తన ఆశయమని, అందుకనే తాను 1993లో విజయ్ అభిమాన సంఘాన్ని స్థాపించానని గుర్తు చేశారు.
విజయ్ ఇప్పుడు పెద్ద స్టార్ అయినప్పటికీ అతడు తన కుమారుడేనని అన్నారు. ఏం చేస్తే తన కుమారుడికి మంచి అవుతుందో ఓ తండ్రిగా ఆలోచించానని పేర్కొన్నారు. పార్టీని ఆయన ఇప్పుడు ఇష్టపడకున్నా, తర్వాతైనా ఇష్టపడొచ్చని, పార్టీ రూపంలో అతడికి మంచి జరగవచ్చని పేర్కొన్నారు. కొంతకాలానికి అతడే అర్థం చేసుకుని దగ్గరకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అతడి పేరు, ఫొటోలు వాడుకుంటున్నందుకు తనను జైలుకు పంపినా పర్వాలేదని, తండ్రిని కటకటాల వెనక్కి పంపిన కొడుకుగా నిలిచిపోతాడని, అది కూడా ఓ చరిత్రగా మిగిలిపోతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు.