CPI Ramakrishna: నంద్యాల ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్యపై సీఎం జగన్ కు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ
- నవంబరు 3న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య
- పోలీసుల వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో
- న్యాయ విచారణ జరపాలంటూ సీపీఐ రామకృష్ణ డిమాండ్
నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. పోలీసుల వేధింపుల కారణంగానే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పైగా, మృతదేహాలకు అర్ధరాత్రి అంత్యక్రియలు జరపడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నవంబరు 3న కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కనిపించడం సంచలనం సృష్టించింది. మృతి చెందిన వారిని నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం, ఆయన భార్య నూర్జహాన్, కుమార్తె సల్మా, కుమారుడు దాదా ఖలందర్ గా గుర్తించారు. ఓ చోరీ కేసులో తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు సలాం ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెలిబుచ్చారు.