Donald Trump: ట్రంప్ శకం ముగిసింది... కొన్ని దేశాలకు ఊరట అంటూ చైనా మీడియా కథనాలు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి
- బైడెన్ ఎన్నికను స్వాగతించిన చైనా అధికారిక మీడియా
- ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం
- ట్రంప్ ఓటమి కొన్ని దేశాలకు ఊరట అని వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలవడం పట్ల చైనా మీడియా స్పందించింది. ఈ ఎన్నికలతో ట్రంప్ శకం ముగిసిందని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. అమెరికా, చైనా మధ్య క్షీణిస్తున్న సంబంధాలను కొత్త అధ్యక్షుడు బైడెన్ సాధారణ స్థితికి తీసుకువస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది. రెండు దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం అయ్యేందుకు, పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడంలోనూ నూతన అధ్యక్షుడి ఎన్నిక అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నామని గ్లోబల్ టైమ్స్ వివరించింది.
ట్రంప్ తో పోలిస్తే బైడెన్ విదేశీ వ్యవహారాల్లో పరిణతితో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తుందని, వాడీవేడి వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఏదేమైనా ట్రంప్ ఓటమితో కొన్నిదేశాలకు ఊరట కలిగిందని చైనా మీడియా అభిప్రాయపడింది.