tea: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా?.. ప్రమాదమంటోన్న పరిశోధకులు
- తేల్చిన ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధకులు
- అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోనికి వెళ్లే ప్రమాదం
- వాటిల్లో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు
కరోనా విజృంభణ నేపథ్యంలో పేపర్ కప్పుల వాడకం మరింత పెరిగిపోయింది. అయితే, వాటిల్లో టీ తాగితే అనారోగ్యం పాలవుతారని ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో మూడుసార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున టీ తాగడం వల్ల 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి వెళతాయని తేల్చారు. 80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని అన్నారు. దీంతో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని తెలిపారు.
పేపర్ కప్పుల్లో టీ పోసినప్పుడు ఆ పేపర్లోని మైక్రోప్లాస్టిక్ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని చెప్పారు. పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారవుతాయని వివరించారు. ఇందులోనూ పాలీ ఇథలీన్ ఉంటుందని చెప్పారు. టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసినా 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్లో చర్య జరుగుతుందని వివరించారు.