Ram Gopal Varma: 'వర్మ మన ఖర్మ' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామ్ గోపాల్ వర్మ
- వర్మ జీవిత కథతో పుస్తకం విడుదల
- ఇందులో తన జీవితం మొత్తం ఉందన్న వర్మ
- నా గురించి ఏవరేం రాస్తారో అని ఆలోచించనని వ్యాఖ్య
సినీ దర్శకుడు రామ్ గోపాల్ జీవితంపై పుస్తకం రిలీజైంది. 'వర్మ మన ఖర్మ' పేరుతో ముద్రితమైన ఈ పుస్తకాన్ని హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఈ పుస్తకం చదివితే తన జీవితం మొత్తం అర్థమైపోతుందని చెప్పారు. ఈ పుస్తకం పేరు నెగెటివ్ గా ఉన్నప్పటికీ... ఇందులో తన జీవితమంతా ఉందని అన్నారు.
తాను మాట్లాడేదాన్ని కొందరు పిచ్చి వాగుడు అనొచ్చని, మరికొందరు ఇంటలెక్చువల్ అని కూడా అనొచ్చని వర్మ చెప్పారు. తన గురించి ఎవరు ఏమి రాస్తారో అని తాను ఆలోచించనని అన్నారు. ప్రతి మనిషిలో ఒక రాక్షకుడు, ఒక మృగం ఉంటాయని చెప్పారు. చాలా మంది చెడును కప్పిపెట్టి మంచి వ్యక్తిలా కనిపించేందుకు యత్నిస్తుంటారని అన్నారు. నువ్వు అనుకున్నదే చేయి, నీవు నీలాగే ఉండేందుకు ప్రయత్నించు అనే దాన్ని తాను నమ్ముతానని చెప్పారు.
తన తల్లి తనను చాలాసార్లు కొట్టిందని... అప్పుడు వర్మ మా ఖర్మ అని అనుకొని ఉండొచ్చని ఆర్జీవీ అన్నారు. కరోనా సమయంలో తాను మాస్కులు, శానిటైజర్లు వాడలేదని చెప్పారు. కరోనా వంటి చిన్న పురుగుకు తాను భయపడనని... దాని కోసం తాను తన లైఫ్ స్టైల్ ను మార్చుకోనని అన్నారు.