Tedros Adhanom Ghebreyesus: జో బైడెన్ విజయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు
- బైడెన్ విజయం ప్రపంచ సహకారానికి సూచన అని వెల్లడి
- బైడెన్, కమలా హారిస్ లో కలిసి పనిచేస్తామని వ్యాఖ్యలు
- తప్పుదారి పట్టించే జాతీయవాదం అంటూ ట్రంప్ పై పరోక్ష విమర్శలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వార్షిక సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం పట్ల స్పందించారు. జో బైడెన్ విజయం కరోనా మహమ్మారి అంతానికి ప్రపంచ సహకారాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ను తుదముట్టించేందుకు జో బైడెన్, కమలా హారిస్ లతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రపంచదేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మహమ్మారి తెలియచెప్పిందని, తప్పుదారి పట్టించే జాతీయవాదం కారణంగా ఇటీవల కాలంలో ఈ దృక్పథం క్షీణించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ అధనోమ్ ఈ విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని జో బైడెన్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు.
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల ఆయనను కలిసిన ఓ వ్యక్తికి కరోనా అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.