Delhi Capitals: ఐపీఎల్ 2020 ఫైనల్: ముంబయితో టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఐపీఎల్ లో నేడు ఫైనల్
- దుబాయ్ లో టైటిల్ సమరం
- ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ టైటిల్ పోరులో కీలకమైన టాస్ ఢిల్లీని వరించింది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ముంబయి జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఐదోసారి కప్ గెలవాలని ఆ జట్టు తహతహలాడుతోంది. మరోవైపు ఢిల్లీ జట్టు ఐపీఎల్ లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దాంతో తొలిసారే కప్ మురిపెం తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకుంటోంది.
కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఒక మార్పు చేశారు. యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్ ను తీసుకున్నారు. ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్ పై నెగ్గిన జట్టునే ఫైనల్ బరిలో దింపుతున్నారు. గత మ్యాచ్ లో విశేషంగా రాణించిన ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ ను ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లోనూ ఓపెనర్ గా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.