Nita Ambani: భవిష్యత్ లో భారత మహిళల క్రికెట్ కు ఢోకా లేదు: నీతా అంబానీ
- భారత మహిళా క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా
- అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని వ్యాఖ్యలు
- అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నారని కితాబు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ భారత్ లో మహిళల క్రికెట్ భవిష్యత్తుపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. భారత మహిళా క్రికెట్ కు ఏ ఢోకా లేదని అన్నారు. రానున్న రోజుల్లో భారత్ లో మహిళల క్రికెట్ మరింతగా అభివృద్ది చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీమిండియా అమ్మాయిలు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు.
అంతర్జాతీయస్థాయిలోనూ మన అమ్మాయిలు విశేషంగా ఆడుతున్నారని, గత ఆరేళ్లుగా భారత మహిళల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్ లలో సత్తా చాటుతోందని, అంజుమ్ చోప్రా, ఝులాన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ క్రికెటర్లు మహిళా క్రికెట్ కు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. ఇప్పటి జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధన, పూనమ్ యాదవ్ వంటి ప్రతిభావంతులు భారత క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని నీతా అంబానీ కితాబిచ్చారు.