Gorantla Butchaiah Chowdary: తన రాజకీయ వారసుడిని ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- తన సోదరుడి కుమారుడు డాక్టర్ రవి రామ్‌కిరణ్‌ను వారసుడిగా ప్రకటన
- మంచి కార్యకర్తలా టీడీపీకి సేవలు అందిస్తాడన్న బుచ్చయ్య
- టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన సోదరుడి కుమారుడైన డాక్టర్ రవి రామ్‌కిరణ్‌ను తన వారసుడిగా ప్రకటించారు. గ్రేటర్ రాజమహేంద్రవరం నుంచి రవి రామ్ కిరణ్ రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని అన్నారు. రాజకీయాల్లో తానెప్పుడూ అవినీతికి పాల్పడలేదని, పైపెచ్చు ఆస్తులు పోగొట్టుకున్నానని బుచ్చయ్య చౌదరి తెలిపారు.
రాజమహేంద్రవరంలో కొందరు పార్టీని తమ కుటుంబ ఆస్తిగా భావిస్తూ కార్యకర్తలను హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన సీనియారిటీని కూడా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తన అబ్బాయి మంచి కార్యకర్తలా పార్టీకి సేవ చేస్తాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తాను ఇప్పటికే ఆరుసార్లు ఎన్నికల్లో విజయం సాధించానని, ఇకపై పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీఎల్పీ ఉప నేతగా ఉన్న తాను త్వరలోనే ఆ పదవికి రాజీనామా చేసి బీసీ నేతకు ఆ పదవి ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరతానని పేర్కొన్నారు.