Nitish Kumar: మా వల్లే నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతున్నారు: శివసేన
- శివసేనకు సీఎం పదవి ఇస్తామని బీజేపీ మాట తప్పింది
- అందువల్లే మహారాష్ట్రలో మహాభారతం చోటు చేసుకుంది
- నితీశ్ కు కూడా బీజేపీ అదే హామీ ఇచ్చింది
జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్ మరోసారి సీఎం కాబోతున్నారు. ఇదే అంశంపై శివసేన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కే సీఎం పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని చెప్పింది. 2019 మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా శివసేనకు బీజేపీ ఇదే హామీ ఇచ్చిందని.. కానీ ఆ హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని తెలిపింది. బీజేపీ మాట తప్పడం వల్లే మహారాష్ట్రలో పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నా దుయ్యబట్టింది.
బీహార్ లో బీజేపీ 70 సీట్లను గెలుచుకుందని... ఇదే సమయంలో జేడీయూ 50 చోట్ల కూడా గెలవలేకపోయిందని సామ్నా విమర్శించింది. అయితే తక్కువ సీట్లు వచ్చినా మీరే సీఎం అంటూ నితీశ్ కి అమిత్ షా హామీ ఇచ్చారని... అదే హామీని శివసేనకు కూడా ఇచ్చి మాట తప్పారని దుయ్యబట్టింది. బీజేపీ మాట తప్పడం వల్లే మహారాష్ట్రలో మహాభారతం చోటు చేసుకుందని పేర్కొంది. ఇప్పుడు నితీశ్ మరోసారి సీఎం కాబోతున్నారంటే అది ముమ్మాటికీ శివసేన చలవేనని అన్నారు.