Tejashwi Yadav: 31 ఏళ్ల నన్ను మోదీ, నితీశ్ ఆపలేకపోయారు: తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు
- ఆర్థిక, అంగ బలాన్ని ఉపయోగించినా నన్ను అడ్డుకోలేకపోయారు
- బీహార్ ప్రజలు మార్పు కోరుకున్నారు
- బీహార్ ఎన్నికల్లో గెలుపు మాదే
బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ పార్టీలకు 31 ఏళ్ల యువ కెరటం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. కొంచెం అటూఇటూ అయిఉంటే తేజస్వి సీఎం అయి ఉండేవారు. ఈ నేపథ్యంలో తేజస్వి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, బీహార్ ప్రజలు తనకే మద్దతు పలికారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీటులో ఎవరు కూర్చున్నా సరే... విజయం తనదేనని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఇద్దరూ ఆర్థిక, అంగ బలాన్ని వినియోగించారని... అయినా 31 ఏళ్ల తనను అడ్డుకోలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించడాన్ని ఆపలేకపోయారని అన్నారు.
నితీశ్ కుమార్ ఛరిష్మా ఏమైందో అందరికీ అర్థమైందని తేజస్వి ఎద్దేవా చేశారు. తాజా ఎన్నికలలో నితీశ్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకున్నారనే విషయం స్పష్టంగా వెల్లడైందని అన్నారు. నితీశ్ కుమార్ సీఎం సీట్లో కూర్చున్నా... తాము మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నామని చెప్పారు.
243 సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో 75 మంది సభ్యులతో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీకి 74 సీట్లు రాగా... జేడీయూకి 43 స్థానాలు వచ్చాయి. దీనిపై తేజస్వి మాట్లాడుతూ, నితీశ్ దొడ్డిదారిలో సీఎం అవుతున్నారని దుయ్యబట్టారు.