India: భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోన్న చేపల్లో కరోనా వైరస్ ను గుర్తించిన చైనా
- దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను పరిశీలిస్తోన్న చైనా
- భారత్‌కు చెందిన బసు సంస్థ నుంచి చేపల దిగుమతి
- వాటిల్లోనూ కరోనా వైరస్ గుర్తింపు
- వారం పాటు వాటి దిగుమతుల నిలిపివేత
భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న చేపల్లో కరోనా వైరస్ ఉంటోందని ఆరోపిస్తూ, ఈ దిగుమతులపై చైనా సర్కారు నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటోన్న చైనా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన బసు ఇంటర్నేషనల్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపింది.
దీంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాయిటర్స్ ఓ కథనంలో తెలిపింది. గడ్డకట్టిన కటిల్‌ఫిష్ ప్యాకేజీలోని మూడు శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే చైనా వారం పాటు వాటి దిగుమతులను నిలిపివేసిందని చెప్పింది.
మరోవైపు కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాకు చెందిన పీటీ అనురాగ్ లౌట్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లోనూ చైనాలోని కస్టమ్స్ అధికారులు కరోనా వైరస్ ను గుర్తించి, ఆ సంస్థ దిగుమతులను కూడా ఏడురోజుల పాటు నిలిపివేశారు. అక్టోబరులోనూ బ్రెజిల్, ఈక్వెడార్, రష్యాల నుంచి తమ దేశానికి వచ్చిన ఆహార పదార్థాలను చైనా కస్టమ్స్ అధికారులు పరిశీలించగా వాటిల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాల నుంచి వస్తోన్న పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.