Supreme Court: బాణసంచా నిషేధంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు
- టపాసులు కాల్చడంపై నిషేధం విధించాలన్న హైకోర్టు
- సుప్రీంను ఆశ్రయించిన ఫైర్ వర్క్స్ డీలర్లు
- ఎన్జీటీ ఆదేశాల ప్రకారం సవరింపులు చేసిన అత్యున్నత న్యాయస్థానం
- గాలి నాణ్యత ఆధారంగా సడలింపులు, ఆంక్షలు
తెలంగాణలో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆధారంగా ఆంక్షలు, సడలింపులు విధిస్తున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట నిషేధం ఉంటుందని, గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉన్నచోట పర్యావరణానికి హాని చేయని టపాసులు పేల్చుకోవచ్చని తెలిపింది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే కాల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మార్గదర్శకాల ఆధారంగా ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపింది.
అంతకుముందు, తెలంగాణ హైకోర్టు బాణసంచా నిషేధం ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అత్యవసర పిటిషన్ పై జస్టిస్ ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణ జరిపింది.
ఈ నెల 9వ తేదీన ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిషేధం ఆదేశాలను సవరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం తెలంగాణ బాణసంచా అమ్మకందార్లకు కొద్దిమేర ఊరట కలిగించనుంది