Amphan: ఆరు రాష్ట్రాలకు రూ. 4,382 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేసిన కేంద్రం
- బెంగాల్, కర్ణాటక, ఎంపీ, ఒడిశా, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలకు సాయం
- ఎన్డీఆర్ఎఫ్ నివేదికను ఆమోదించిన హైలెవెల్ కమిటీ
- పశ్చిమబెంగాల్ కు భారీ సాయం
ఈ ఏడాది పలు రాష్ట్రాలను ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 6 రాష్ట్రాలకు సహాయ నిధులను కేంద్రం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలకు రూ. 4,382 కోట్ల నిధులను విడుదల చేసింది. తుపానులు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నేపథ్యంలో ఆర్థిక సాయం అందించింది. ఎన్డీఆర్ఎఫ్ అందించిన నివేదిక ఆధారంగా ఒక హైలెవెల్ కమిటీ ఈ నిధులకు ఆమోదం తెలిపిందని ఓ ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది.
వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలు ఇవే:
- ఎంఫన్ తుపాను: పశ్చిమబెంగాల్ కు రూ. 2,707.77 కోట్లు, ఒడిశాకు రూ. 128.23 కోట్లు.
- నిసర్గ తుపాను: మహారాష్ట్రకు రూ. 268.59 కోట్లు
- నైరుతి రుతుపవనాల కారణంగా విరిగిపడ్డ కొండిచరియలు: కర్ణాటకకు రూ. 577.84 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 611.61 కోట్లు, సిక్కింకు రూ. 87.84 కోట్లు.