Rahul Dravid: ప్రతిభావంతులు వెలుగులోకి రావాలంటే ఐపీఎల్ లో జట్ల సంఖ్య పెరగాలి: ద్రావిడ్
- ప్రస్తుతం ఐపీఎల్ లో 8 జట్లు
- వచ్చే సీజన్ కు 9వ జట్టు వస్తుందంటూ సంకేతాలు
- ఐపీఎల్ విస్తరణ మంచిదేనన్న ద్రావిడ్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రస్తుతం 8 జట్లు ఉన్నాయి. అయితే వచ్చే సీజన్ కు 9వ జట్టు కూడా వస్తుందంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. బహుశా గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ విస్తరణ మంచిదేనని అభిప్రాయపడ్డారు. మరింతమంది ప్రతిభావంతులు అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే లీగ్ లో జట్ల సంఖ్య పెరగాల్సి ఉందని అన్నారు. భారత్ లో ఎంతోమంది నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లు ఉన్నారని, వారందరూ అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం కోసం చూస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్లందరికీ అవకాశాలు కల్పించాలంటే ఐపీఎల్ విస్తరణ సరైన మార్గం అని ద్రావిడ్ వెల్లడించారు. చాన్సులు ఇవ్వాలేగానీ కొత్త ముఖాలు తెరపైకి వస్తాయని పేర్కొన్నారు. ఐపీఎల్ వర్గాలు కూడా విస్తరణకు సుముఖంగానే ఉన్నాయని సూచన ప్రాయంగా చెప్పారు.