Yanamala: ఇతర పీఠాలకు, స్వామీజీలకు లేని మర్యాదలు స్వరూపానందకు ఎందుకు?: యనమల
- ఈ నెల 18న స్వరూపానంద జన్మదినం
- ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలని ప్రభుత్వ ఆదేశాలు
- స్వామి భక్తి ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలన్న యనమల
ఈ నెల 18న విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాల నుంచి ఆయనకు ఆలయ మర్యాదలు, కానుకలను పంపాలని రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయరంగును పులుముకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు.
దేవాలయాలు, స్వామీజీల పట్ల ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు తాజా ఆదేశాలు వ్యతిరేకమని యనమల అన్నారు. ఇప్పటికే శారదాపీఠంపై అనేక వివాదాస్పద కథనాలు వస్తున్నాయని... ఈ తరుణంలో ఆయనకు ఆలయ మర్యాదలు చేయాలంటూ వెలువడిన ఆదేశాలు వివాదాన్ని మరింత పెంచాయని చెప్పారు. కాశీలో తనతో హోమాలు చేయించిన స్వరూపానందపై స్వామి భక్తి ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్నారు. జగన్ తింగర చేష్టలకు, పెడ ధోరణికి ఇదొక నిదర్శనమని చెప్పారు.
స్వరూపానందకు జగన్ భక్తుడైతే కావచ్చని... అంతమాత్రాన ఆయన కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడటం తగదని యనమల మండిపడ్డారు. కంచి పీఠాధిపతికి, చినజీయర్ స్వామికి, ఇతర స్వామీజీలకు లేని ఆలయ మర్యాదలు స్వరూపానందకు ఎందుకని ప్రశ్నించారు. జగన్ నిర్ణయం ఇతర స్వామీజీలను, పీఠాలను అవమానపరచడమేనని అన్నారు.
దుష్ట సంప్రదాయాల సృష్టికర్తగా జగన్ తయారవుతున్నారని యనమల చెప్పారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి గడ్డు రోజులు దాపురించాయని విమర్శించారు. వివాదాస్పద ఆదేశాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఏం చెప్పినా జగన్ వినరని అన్నారు. ఆధ్యాత్మిక విలువను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి పనులకు స్వస్తి పలికి... రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. స్వామి భక్తి కోసం కాకుండా... పేదల సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు.