Venkaiah Naidu: హైదరాబాదులోని కుమారుడి ఇంట్లో దీపావళి పూజలు నిర్వహించిన వెంకయ్యనాయుడు దంపతులు
- నేడు దీపావళి
- అర్ధాంగి ఉషతో కలిసి మహాలక్ష్మి పూజ నిర్వహించిన వెంకయ్య
- గుమ్మడి గోపాలకృష్ణతో పద్య శ్రవణం
ఇవాళ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని తమ కుమారుడి నివాసంలో మహాలక్ష్మి పూజ నిర్వహించామని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన అర్ధాంగి ఉషతో కలిసి ఈ పూజలో పాల్గొన్నానని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించానని వెంకయ్య వివరించారు. అంతేకాకుండా, తెలుగు పద్య నాటక ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారితో హైదరాబాదులో సాహిత్య గోష్ఠి నిర్వహించామని పేర్కొన్నారు.
మన పద్యం, మన సాహిత్యం గురించి చర్చించుకున్నామని, పండుగ రోజు సత్కాలక్షేపం చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ తెలుగు సాహిత్యంలో మేలి ముత్యాల్లాంటి పద్యాలను ఆలపించారని, అల్లసాని పెద్దన, శ్రీనాథుడు రచించిన పద్యాలతో పాటు పలు పురాణ ఘట్టాలను రాగ, భావయుక్తంగా ఆలపించి అలరించారని వెంకయ్య వెల్లడించారు. తమను ఆనందింపచేసిన ఆయనను అభినందిస్తున్నానని ట్విట్టర్ లో స్పందించారు.
"పద్యంలో చక్కని పదబంధం, సాహిత్యం, మాధుర్యంతో పాటు సందేశం కూడా ఇమిడి ఉంటుంది. అది మనసును రంజింపచేస్తుంది. తెలుగుభాషకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పద్యాన్ని మరింత విస్తృతం చేయడంలో ప్రచార, ప్రసార సాధనాలు కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.
"తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నంలో మన పద్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆవశ్యకం. రామాయణ, మహాభారతాలు సహా మన పురాణేతిహాసాలను మన పెద్దలు పద్యనాటకాల ద్వారా ప్రాచుర్యం చేశారు" అని పేర్కొన్నారు.
"తెలుగు పద్యం అంతటి మనోజ్ఞమైనది, మధురమైనది, సుందరమైనది మరే భాషలో లేదనడం అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదనానికి ప్రతీక తెలుగు పద్యం. అలాంటి తెలుగు పద్యాన్ని కాపాడుకుని, భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది" అని ఉద్బోధించారు.