Shivsena: రాహుల్ గాంధీపై ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన... ఏం తెలుసంటూ ఆగ్రహం!
- రాహుల్ సమర్థతపై సందేహాలు వ్యక్తం చేసిన ఒబామా
- విదేశీ నేత భారత నాయకులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్న శివసేన
- ట్రంప్ ను మేం పిచ్చోడు అన్నామా? అంటూ రౌత్ ఆగ్రహం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థతపై సందేహాలు వ్యక్తం చేస్తూ తన పుస్తకంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు శివసేనకు కోపం తెప్పించాయి. భారత రాజకీయ నాయకుల గురించి ఒబామాకు ఏం తెలుసంటూ మండిపడింది. ఓ విదేశీ నేత భారత రాజకీయ నాయకుడి గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. తామెప్పుడైనా డొనాల్డ్ ట్రంప్ ను పిచ్చోడు అని అన్నామా? అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒబామా 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' అనే పుస్తకం రాశారు. ఇందులో చైనా, రష్యా, భారత్ తదితర దేశాల నాయకుల గురించి ప్రస్తావించారు. రాహుల్ గాంధీ గురించి చెబుతూ, ఓ టీచర్ మెప్పు కోసం ఆరాటపడే విద్యార్థి మనస్తత్వం అని, విషయ పరిజ్ఞానం పెద్దగా లేదని అభివర్ణించారు.