Andhra Pradesh: ఐదున్నర నెలల తర్వాత ఏపీలో అతి తక్కువ మరణాలు నమోదు
- గత 24 గంటల్లో ఏడుగురి మృతి
- 1,657 పాజిటివ్ కేసులు నమోదు
- 2,155 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా మరణాల శాతం మునుపటితో పోల్చితే గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 7 మరణాలు సంభవించాయి. దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఇవే అతి తక్కువ మరణాలు. కృష్ణా జిల్లాలో 2, అనంతపురంలో 1, చిత్తూరు జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరులో 1, కర్నూలు జిల్లాలో 1 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 6,854 మంది కరోనాతో మృతి చెందారు.
ఇక కేసుల విషయానికొస్తే గత 24 గంటల్లో 79,823 కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 1,657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 252 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులు వెల్లడయ్యాయి. తాజాగా 2,155 మందికి కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 8,52,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,26,344 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ఇంకా 19,757 మంది చికిత్స పొందుతున్నారు.