Joe Biden: వచ్చే ఏడాది వరకు నేను అధ్యక్షుడ్ని కాలేను... అప్పటివరకు కరోనా ఆగుతుందా?: జో బైడెన్
- అమెరికాలో కరోనా విజృంభిస్తోందన్న బైడెన్
- నేను ఆగినా కరోనా ఆగదంటూ వ్యాఖ్యలు
- ట్రంప్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాను అధ్యక్ష పదవికి ఎన్నికైనా వచ్చే ఏడాది వరకు అధ్యక్షుడ్ని కాలేనని, అప్పటివరకు కరోనా ఆగుతుందా? అని ప్రశ్నించారు. నేను ఆగినా, కరోనా వైరస్ ఆగుతుందా? అని వ్యాఖ్యానించారు.
కరోనా మహమ్మారికి క్యాలెండర్లు, తేదీలతో పనిలేదని, దాని పని అది చేసుకుంటూ వెళుతుందని తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రస్తుత ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచినా, ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం 2021 జనవరి వరకు ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.