Madhya Pradesh: తప్పిపోయిన తమ సహచరుడిని 15 ఏళ్ల తరువాత గుర్తించిన మధ్యప్రదేశ్ పోలీసులు!
- 1999లో పోలీసు ఉద్యోగంలో చేరిన మనీశ్ మిశ్రా
- 2005 నుంచి కనిపించకుండా పోయిన వైనం
- సహచరులకు తాజాగా కనిపించడంతో ఆశ్చర్యం
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ సహచరుడిని మధ్యప్రదేశ్ పోలీసులు గ్వాలియర్ వీధుల్లో అనుకోకుండా గుర్తించారు. ఈ విషయాన్ని వెల్లడించిన డీఎస్పీ రత్నేశ్ సింగ్ తోమర్, తాను విజయ్ సింగ్ బహదూర్ తో కలిసి గ్వాలియర్ లోని ఓ మ్యారేజ్ హాల్ సమీపంలో వెళుతుండగా, యాచకుడి మాదిరిగా కనిపిస్తున్న ఓ వ్యక్తి తారసపడ్డాడని అన్నారు. అతను చలికి వణుకుతూ, ఆహారం కోసం వెతుకుతున్నాడని గుర్తించి, తాను ధరించిన జాకెట్ ను అతనికి ఇచ్చేందుకు వెళ్లామని, ఆ సమయంలో అతన్ని దగ్గరి నుంచి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యామని చెప్పారు. అతను తామిద్దరినీ పేరు పెట్టి పిలిచాడని అన్నారు.
2005 వరకూ తమతో పాటు పనిచేసిన మాజీ కొలీగ్ మనీశ్ మిశ్రా అతనేనని గుర్తించామని, దాతియాలో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తూ, మిశ్రా కనిపించకుండా పోయారని చెప్పారు. ఆపై అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయిందని, ఇన్నాళ్లకు అతను తిరిగి కనిపించాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనీశ్ ను ఓ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలోని శిబిరానికి తరలించామని అన్నారు. మనీశ్ మిశ్రా మంచి అథ్లెట్ అని, షార్ప్ షూటర్ గానూ పేరు తెచ్చుకున్నాడని, తమతో పాటు 1999లో పోలీసు ఫోర్స్ లో చేరి, ఆపై మానసిక సమస్యలను ఎదుర్కొన్నారని, చికిత్స జరుగుతుంటే, తప్పిపోయారని నాటి ఘటనలను తోమర్ గుర్తు చేసుకున్నారు.