New Delhi: దేశ రాజధానిలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యం!

Delhi Pollution is in Dangerous Level
  • నిన్న 414కు చేరిన ఏక్యూఐ
  • నిషేధం ఉన్నా టపాకాయలు కాల్చిన ప్రజలు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు
దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా టపాసులను కాల్చడంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, పలు ప్రాంతాల్లో ప్రజలు, పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లోని పంట పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను రైతులు తగులబెడుతూ ఉండటంతో కాలుష్యం భారీగా పెరిగిపోయింది.

గురువారం నాడు 314, శుక్రవారం నాడు 339గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శనివారం నాడు ఏకంగా 414కు పెరిగిపోయింది. నగరంలో కాలుష్య స్థాయి పీఎం 2.5కు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గాలిలోని ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి, పలు రకాల వ్యాధులకు గురి చేయనుందని, క్యాన్సర్ తో పాటు గుండె సమస్యలు పెరగనున్నాయని అధికారులు హెచ్చరించారు.

ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయి 400 దాటేసిందని, ఏక్యూఐ 60 పాయింట్లు దాటితేనే అనారోగ్యానికి సంకేతమని అధికారులు తెలిపారు. అటువంటిది 400 దాటడంతో, ప్రజలు తీవ్ర అనారోగ్యం ముంపున ఉన్నారని అన్నారు. కాగా, ఇప్పటికే వేలాది మంది ఢిల్లీ వాసులు కళ్లు మండుతున్నాయని, గొంతు నొప్పిగా ఉందని, ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని చెబుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా మహమ్మారి మూడవ దశ విస్తరణలోకి ప్రవేశించిన వేళ, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

New Delhi
Pollution
AQI

More Telugu News