Corona Virus: వచ్చే ఏడాది శీతాకాలం నాటికి కరోనా తగ్గుతుంది: బయో ఎన్టెక్ సీఈవో సాహిన్
- వ్యాక్సిన్ ద్వారా కరోనా వ్యాప్తి 50 శాతం తగ్గుతుంది
- అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి
- మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కట్టడి కోసం జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉగూర్ సాహిన్ తాజాగా మాట్లాడుతూ... వచ్చే ఏడాది శీతాకాలం నాటికి ప్రపంచ దేశాల ప్రజలు కొవిడ్-19 నుంచి బయటపడే అవకాశం ఉందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ద్వారా ప్రజల్లో వైరస్ వ్యాప్తి కనీసం 50 శాతం తగ్గుతుందని తెలిపారు.
అప్పటి వరకు కరోనా కట్టడి కోసం ప్రజలందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కాగా, నెల రోజుల క్రితం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అమెరికాలో రోజుకి లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్సులో గత 24 గంటల్లో 32,085 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.