santanam: ఓటీటీ, థియేటర్ మధ్య తేడాను ఆసక్తికరంగా చెప్పిన కమెడియన్ సంతానం!
- ఓటీటీ మన ఇంట్లో ఉండే పూజ గది లాంటిది
- థియేటర్ దేవాలయంలాంటిది
- ఈ రెండు చోట్లా దేవుడు ఉంటాడు
- అనుభవం మాత్రం భిన్నంగా ఉంటుంది
తమిళ నటుడు సంతానం నటించిన ‘బిస్కోత్’ సినిమా తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా అనేక సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. బిస్కోత్ సినిమాను మాత్రం థియేటర్లలోనే విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
థియేటర్లో అభిమానులతో కలిసి సంతానం ఈ సినిమాను చూశాడు. అనంతరం థియేటర్లు, ఓటీటీల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమా థియేటర్లలో విడుదల కావడం సంతోషంగా ఉందని, చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని తెలిపాడు.
వారు వస్తేనే సినీ పరిశ్రమ మనుగడ కొనసాగిస్తుందని ఆయన చెప్పాడు. ఓటీటీ అంటే మన ఇంట్లో ఉండే పూజ గది లాంటిదని, థియేటర్ దేవాలయం లాంటిదని తెలిపాడు. ఈ రెండు చోట్లా దేవుడు ఉన్నప్పటికీ, అనుభవం మాత్రం భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, కరోనా నేపథ్యంలో భారత్‌లో ఓటీటీకి కూడా బాగా ఆదరణ దక్కుతోన్న విషయం తెలిసిందే.